అక్కినేని తెలుగు సినిమాకు కీర్తి కిరీటం లో కలికితురాయి. తెలుగు సినిమా నటనను , నడకను నేర్పిన మొదటి తరం నటుడు అక్కినేని. ఎన్నో పాత్రల్లో నటించి జీవించిన మహా నటుడాయన. తెలుగు సినిమాకు రెండు కళ్ళు గా బావించే ఎన్టిఆర్, ఎ.ఎన్.ఆర్ ఇద్దరు మరణించడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. రెండు కళ్ళను కోల్పోయిన తెలుగు కళామతల్లి గుడ్డిదైపోయింది అని పలువురు సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలో జీవించే వారు అక్కినేని. అక్కినేని నటించిన సినిమాలు ఎన్నో ఆణిముత్యాలు గా నిలిచాయి. అక్కినేని నాగేశ్వర రావు 1924 సెప్టెంబర్ 20 వ తేదీ కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా లోని నందివాడ మండలం రామాపురం లో జన్మించాడు. చిన్నప్పటినుండే ఆయనకు నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. అలా అనేక నాటకాలలో నాయికగా (స్త్రీ ) పాత్రలను పోషించి మెప్పించాడు. అలా నాటకాల్లో ఉండగా 1940 లో వచ్చిన "ధర్మపత్ని" సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంబం అయ్యింది.  ఆ తరువాత హీరోగా నటించిన మొదటి చిత్రం మాత్రం శ్రీ సీతారామ జననం. ఈ చిత్రం 1944 లో వచ్చింది. ఆ చిత్రం తరువాత  బాలరాజు, కీలుగుర్రం, లైలామజ్ను, దేవదాసు, విప్రనారాయణ, దొంగరాముడు, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ, మాయాబజార్, బాటసారి, అనార్కలి, మూగమనసులు,  ఆత్మబలం, ఇద్దరు మిత్రులు, అమరశిల్పి జక్కన, దసరా బుల్లోడు, బంగారు బాబు, ప్రేమ నగర్, భక్త తుకారాం,  వంటి అనేక చిత్రాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. నటనతో పాటు అక్కినేని సామజిక సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.  గుడివాడలోని కాలేజీ కోసం భారీ విరాళాన్ని అందించారు. దానికి గుర్తుగా వారు ఎ.ఎన్.ఆర్ కాలేజ్  అని నామకరణం చేశారు.

 తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్ధులకు ఉపకారవేతనాలు, విరాళాలు అందించారు. హీరోగా నే కాకుండా అన్నపూర్ణ బ్యానర్ పై ఎన్నో సినిమాలు నిర్మించాడు. అలాగే అన్నపూర్ణ స్టూడియో ను కుడా నిర్మించాడు. అక్కినేని సినిమాల్లోకి వచ్చిన కొద్ది కాలం లోనే ఆయనకు  అన్నపూర్ణ తో 1949 ఫిబ్రవరి 18న  వివాహం  జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. అక్కినేని ఎన్నో అవార్డులను అందుకున్నారు దాదాసాహెబ్ ఫాల్కే , పద్మ విభూషణ్ ఇలా ఎన్నో అవార్డులు ఆయన నటనకు చెరగని ఆనవాల్లుగా నిలిచాయి. అక్కినేని జాతీయ అవార్డు పేరుతో ఆయన ఏర్పాటు చేసిన జాతీయ అవార్డు ను ప్రతి ఏడాది పలుబాషల్లో నిష్ణాతులైన కళాకారులకు అందిస్తున్నారు. అక్కినేని నట వారసులు ప్రస్తుతం సినిమాల్లో హీరోలుగా వెలుగొందుతున్నారు. నాగార్జున, మనవళ్లు సుమంత్, సుశాంత్, నాగ చైతన్య,  అఖిల్ సినిమా రంగం లో ఉన్నారు. అక్కినేని తొంబై ఏళ్ళకు కూడా ముఖానికి రంగేసుకోవడం మానలేదు ప్రస్తుతం ఆయన అక్కినేని ఫ్యామిలీ అంత కలిసి నటిస్తున్న "మనం" సినిమాలో నటిస్తుండడం విశేషం. ఇటీవలే తనకు కాన్సర్ వ్యాది ఉందని చెప్పిన  ఆయన ఈ రోజు 22-01-2014 బుదవారం తెల్లవారు జామున 2:15am గంటల సమయంలో తుది శ్వాస విడిచాడు. సిని కళామతల్లి ఓ మహా నటుడ్ని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటుంది టీం టాలీవుడ్.

Post a Comment

 
Top